మేఘమునకు నేల మీద కురవాలని ఆరాటం
ప్రతి నదికీ సంద్రంలో కలవాలని ఆరాటం
ఎగిసి ఎగిసి అలసిపోయి విసుగెత్తిన కెరటాలకు
కొద్ది సేపు తీరంలో ఆగాలని ఆరాటం
సంగీతం ఓనమాలు తెలియలేక మూగవైన
పవనాలకు వేణువులో మ్రోగాలని ఆరాటం
పువ్వులలో దాగి ఉన్న మధురమైన మకరందం తుమ్మెదలకు తనివి తీర తాగాలని ఆరాటం
నాలోనే శివమెత్తిన ఆలోచన అలజడులను
శాంతించే వరకు ఇలా రాయాలని ఆరాటం
-Shiva Krishna Ksk
-
అ
చల
శీత
గంగ
చినుకు
నింగి నుండి
రాలింది వెచ్చని
వసుమతి తడిసింది
కమ్మని మృత్తిక గంధం
పంచింది పచ్చిక చిగురు
మొలిచింది ప్రకృతి కాంత
పులకాంకితయై జీవాలకు
ప్రాణం పోసి ప్రేమతో
క
రు
ణిం
చిం
ది
.
!
-
ఎవరి మీదైనా సరే లేని ప్రేమని నటించకండి,
మీది నటన కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం..-
రెప్ప వాల్చిన తరుణం , మనసు చేరెను నీ చరణం
కలలోనైనా నీ సువర్ణం , వీడిపోని నిధురబంధం
రెప్ప మూయగ చీకటి ముసిరిన లోకాన కిరణం నువ్వేగా
మనసు మూసిన మూగబోయిన పెదవిన వర్ణం నువ్వేగా
తళుకుమనే తామర చూడదా ఉషోదయ కాంతి కోసం
ఎగిసిపడి నీడనై నడవనా నా పాదము నీవేనంటూ
మినుకుమనే మిణుగురు కోరదా చల్లని జాబిల్లి కరం
ఒడిసిపడి ఒడిలోన చేరనా ఈ జన్మ నీదేనంటూ
ఆశపడి అడుగుతున్నా ఓ సారి చూడవా
మోయలేక చస్తున్నా ఈ ప్రియ వేదన
ఒక చూపు చాలుగా నే మునిగిపోన...!
వెంటపడి తమురుముతున్నా ఓ నారి పలకవా
దాయలేకపోతున్నా ఈ ప్రణయ భావన
ఒక మాట చాలుగా నీ దాసుడినైపోనా...!-
పదాలు ప్రామాణికం కాదు
హత్తుకునే ప్రేరణ ముఖ్యం
ప్రాస ముఖ్యం కాదు
ప్రవాహం ముఖ్యం
వర్ణన ముఖ్యం కాదు
అనుభూతి ముఖ్యం
వ్యాకరణం ముఖ్యం కాదు
భావన ముఖ్యం
అలంకారం ముఖ్యం కాదు
సహజత్వం ముఖ్యం
భావం ముఖ్యం కాదు
భాష్యం ముఖ్యం-
తూర్పు రాగం జ్వలిస్తుంటే
కలల దాహం తీరకుండానే
మేలుకొన్నాను
రాత్రి రాలిన నక్షత్రాల్ని
దులుపుకుంటూ
ఉదయపు రెక్కల్ని
తొడుక్కున్నాను
అలుపెరగని గమనంలో
విశ్రాంతి తీసుకున్న
ఊహల్ని ఊరడించి
మళ్ళీ తిరిగొచ్చే రాతిరికోసం
మనసు గదిని సిద్ధం చేసుకున్నాను
అప్పుడక్కడ
నింగంతా నేను
నేనంతా చినుకుపూల తారకలు...-
ఈ వర్షం
జాలువారే ముత్యాలుగా
పుడమి ఎదను తాకే లోగా
చేతితో ఒడిసిపట్టి
వేళ్ళ సందుల్లో జార విడిచి
నింగితో ఆడుకోవాలనే ఆశ..
చినుకు చినుకు వెల్లువై పొంగుతుంటే
నన్ను నేను మరిచిపోయి
నాట్య మయూరినై
చిందులేయాలనే తపన
కదులుతున్న మేఘాల వెనుక
చిరుగాలిలా
పరుగులు పెట్టేలా ..
ఊహల సమీరాల వెంట
కలలన్నీ కదిలెళ్ళేలా చేస్తున్నాయి.-
వెలుగుల వెన్నెల జల్లే శశివి నీవైతే
గరాళాన్ని గొంతున దాచిన శివుని నేను..
కాంతుల వలువలు ధరించిన శశివి నీవైతే
ఏకాంతపు వలయంలో బంధించబడిన నిశిని నేను..
రక్కసి నిశలో మునిగిన ఆకశాన వన్నెలు చిందే శశివి నీవైతే..
చిక్కని తలపుల నిషాలో తూలుతూ పరవశించి చిందేసే శశిధరుడని నేను..
-
అడుగులు మోసే అవనో అమ్మ
ఆకలి తీర్చే అన్నము అమ్మ
దేహంలో ప్రతి అణువు అమ్మ
దాహం తీర్చే జలమో అమ్మ
గాలీ, గగనం, మేఘం అమ్మ
ప్రాణం నిలిపే ప్రతిదీ అమ్మ...
తప్పును దిద్దే నాన్నో అమ్మ
ఆతని కన్నుల చెమ్మో అమ్మ
దైవ సమానులు గురువులు అమ్మ
త్యాగ మూర్తులు తరువులు అమ్మ...
ధైర్యం పెంచే మాటో అమ్మ
దుర్మార్గుల చీల్చే కత్తో అమ్మ
అన్నార్థుల ఆకలి తీర్చగ కరిగిన
కదిలొచ్చే ప్రతి మనసో అమ్మ...
కనిపెంచిన రూపమె కాదు
కరుణించిన గుణమో అమ్మ
చితి చేరే చిరు పయనంలో
ఎదురయ్యే ప్రతి మమతో అమ్మ
సంధ్య.Ch
-