వెన్నెల ఒడ్డున నేను
మబ్బుల మాటున తాను
సంద్రం వింటోంది
మా ముచ్చట్లు-
అభిమాని నండి అంటూ తలుపు తట్టింది ఓ రోజు
ఆత్మీయురాలు అయిపోయింది ఈరోజు
మీరు మీరు అని పిలుచుకునే దూరం నుంచి
నువ్వు అనుకునే దగ్గర తనం దాకా
సాగిన సాహితీ స్నేహం
ఎన్నో అనుభూతుల్ని పంచుతూనే ఉంది.
నన్ను ఎవరైనా పొగిడితే తన పొంగిపోతుంది
నన్ను ఎవరైనా విమర్శిస్తే తను నాకు సైన్యం అవుతుంది.
నా సాహితీ ప్రయాణంలో నాకు దొరికిన అద్భుతం
ప్రియనేస్తం జ్యోత్స్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు
నీ నేస్తం
శివలక్ష్మి
-
కవితలెన్ని రాస్తున్నా కలల సలుపు తీరలేదు
గుండె నెంత కోస్తున్నా మనసు తలుపు తీయలేదు
మౌనంగా తొలగిపోయి ఈ దూరం వరించాను
బలి కోరిన అగాధాల లోతెంతో అడగలేదు
నిన్ను నీకు వదిలేస్తూ నింద నేను భరించాను
నిను చేరని నాభావపు బరువెంతో తెలియలేదు
నీ కోసం రాసుకున్న మనసు కథలు విన్నావా
తడికన్నుల లేఖల్లో తపనెందుకు చదవలేదు
చిరునవ్వుకు చితి పేర్చిన తప్పెవరిది ఓ సత్యా!!
చిదిమేసిన నా హృదయం ఎప్పటికీ చెప్పలేదు
-
కవితలెన్ని రాస్తున్నా కలల సలుపు తీరలేదు
గుండె నెంత కోస్తున్నా మనసు తలుపు తీయలేదు
How many of u waiting for my next gajal
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹-
కవిత రాసి వెళ్ళిపోకు…. నా హృదయం తపిస్తోంది
మనసు గదిని మూసి పోకు….నీ మౌనం దహిస్తోంది
ఉలికి పడిన ప్రతిసారీ గుండె తడిమి చూస్తున్నా
పొల మారితె పొరబడకే… నీ పేరే జపిస్తోంది
మరిచానని తలచావా??? మరణించే ఉంటాలే….
నిను చేరని నా లోకం శూన్యాలను వరిస్తోంది
ఏ భావం బరువైందో…. కన్ను చమ్మగిల్లుతోంది
విషాదాల్ని వరమిచ్చిన కాలాలను శపిస్తోంది
మనసెందుకు ఓ సత్యా!!!!...మరీ ఇంత పాషాణం..
ప్రణయ సుధలు వెలివేస్తూ మరణ గాథ రచిస్తోంది..
-
కవితగా నే చచ్చిపుడతా కలలు అన్నీ రాలిపోనీ..
మౌనమై నే ముగిసిపోతా మనసు గీతం రాసిపోనీ..
ఎన్ని జన్మల పుణ్యఫలమో గుండె గుండెను తడుపుతున్నా
అశ్రువై నే జారిపోతా ఆశువై నను మిగిలిపోనీ
విషాదానికి విసుగు రాదా!!!ప్రతీ గాయం గేయమైతే
కాలమంతా కరిగిపోతా కావ్యమై నను రగిలిపోనీ
రుధిరధారల దారులన్నీ భావగీతం పాడుతున్నవి
జన్మకింకే అర్థమున్నది చరిత నేనై చెరిగిపోనీ…
గుండెపిండే వేదనంతా వేణువైనది కదా సత్యా!!!
మరణమైనా బతికి పోతా చివరి గీతం పాడిపోనీ…
-
నా దుఃఖం నాకివ్వు ఓ కవితరాసుకోవాలి
ఓ శూన్యం బదులివ్వు నే కథగముగిసిపోవాలి
ఆ దూర తీరాల్లో నే కలగన్న గమ్యాలు
ఆ మార్గం కరిగించు నా మనసు చేరుకోవాలి
ఎదలోపల ఎవరెరుగని ఈ గాయాల సలుపేంటి
ఓ కునుకును వరమివ్వు నే కలగకరిగిపోవాలి
జాలి లేని కాలానికి ఏ జావళి పాడగలను
నా గతమును తిరిగివ్వు చిరునవ్వు పూసుకోవాలి
మండని ఏ గుండెలకూ గెలుపుండదు ఓ సత్యా!!
ఏ మరణం రానివ్వు ఓ చరితరాసిపోవాలి…
-
మోయలేని వ్యథల కథలు నిర్దయగా రాసేయకు
మనిషి నైన పాపానికి మరణానికి వదిలేయకు
పదము పట్టి జన్మంతా పదము కట్టి పాటైనా
శృతి తప్పని విన్నపాలు మన్నుపాలు చేసేయకు
నీ ముంగిట దీపానికి రక్ష నేను అనుకున్నా
పిచ్చి కదా! నా లోపలి జ్ఞాన జ్యోతి ఆర్పేయకు
పువ్వు నీవు నవ్వు నీవు ప్రతి అణువున పరమాత్మవు
ఏమివ్వను నన్ను తప్ప!! కాదంటూ విసిరేయకు
నాటకాన వేషానికి నాందితనే ఓ సత్యా!!!
ముగుస్తున్న నా పాత్రని కర్మానికి వదిలేయకు
-
కలా నాదే కథానాదే వ్యథే ఏదో రచించావా
క్షణం నాదే రణం నాదే స్మృతై నీవే గతించావా
ఒకే జన్మం ఒకే బంధం ముడేస్తావో వెలేస్తావో
నువే లోకం అనే మైకం భ్రమల్లోనే చరించావా
వరించావో వధించావో విధేనంటూ బలిచ్చావో
వినోదంగా విషాదంగా ఒకే వాక్యం లిఖించావా
సృజించావో త్యజించావో తపిస్తున్నా శపించావో
శవం నేనే శివం నేనే అనే గర్వం క్షమించావా
సహిస్తున్నా… సదా నీకై జపిస్తున్నా కదా ఈశా!!
ఒకో కర్మా నశిస్తుంటే అహం ఏదో దహించావా…
-
నా నవ్వుకు ఏ స్వరముల వైణికుడో నాన్నంటే
నా విజయపు ఏ స్వేదపు హాలికుడో నాన్నంటే
నా నల్లని వదనంలో సిరివెన్నెల చూస్తాడే
వింత కదా! ఎంత పిచ్చి ప్రేమికుడో నాన్నంటే
పేదరికపు మారాజే.. యువరాణిగ పెంచుతాడు
నిజము కదా.. ఎంత వింత మాంత్రికుడో నాన్నంటే
గాయపడ్డ ప్రతిసారీ పోరాటం నేర్పుతాడు
గెలిపించే ఎంత గొప్ప సైనికుడో నాన్నంటే
కంటి చెమ్మ కనిపించదు ఎవ్వరికీ ఓ సత్యా!!
ఏ వేదం విరచించిన తాత్వికుడో నాన్నంటే..
-