ఆడపిల్ల
ఇంట్లో చిన్న కూతురుగానైనా పుట్టాలి లేదంటే
జీవితం పట్ల సరైన అవగాహన వచ్చే వరకు అవకాశం ఐనా లభించాలి.-
నాలానే అవి లోలో నలుగుతున్నాయని
చిరు గాలి చెలిమిలేక
చినుకులుగ చేరలేక
భువి తాము తాకలేక
సడి లేని మౌన కేక
ఎంతెంత ఏడ్చినాయో
ఎరుపెక్కి రగిలినాయో
-
మాటలు..
కొన్నిసార్లు అవతలి వ్యక్తి మనసులో నాటుకుపోతాయి
ఇంకొన్ని సార్లు ఎన్నో పనులకు
ప్రణాళికలవుతాయి
ఊరికే అని వదిలేసి, ఇంకోటి మాట్లాడి
మనసులతో ఆడుకోకండి-
నింగిన చుక్కల్లా
మది నిండా ప్రశ్నలు..
నిండిన చీకటిలా
కమ్ముకున్న దిగులు...
అడగనంటుంది మౌనం
అలసిపోయింది ప్రాణం..
కదిలిపోతుంది కాలం
కావ్యమయ్యింది కలహం...
-
ఒక్కరైనా మెచ్చుకోని ఉట్టి మాటల జంటగా
ఒక్క హృదయం విచ్చుకోని పిచ్చి నవ్వులు దండగా-
ఎవరెవరో చేసే రీల్స్ చూసి చూసి
కనులకు అలసట తప్ప ఇంకేం లేదు
మనసు మాటల్ని కలంతో రాస్తూ, కాలంతో పయనించిన
క్షణాలే అద్భుతం
మధురమైనది నాటి గతం
-
ఆటల్లో పాటల్లో కాలమెపుడు కరిగిందో
ఆ నిన్నటి గురుతులో బాల్యమెపుడు చేరిందో
కోరిన జత చేరిన కథ ఎంత మధురమో "సంధ్యా"
కాంతి పూల దారుల్లో దూరమెపుడు తరిగిందో
తన మాటే నెగ్గాలని ఆగడాలు పుట్టింట్లో
కోడలిగా అడుగిడగా అణకువెపుడు అమరిందో
నట్టింట్లో నడయాడే సిరి వెలుగే ఆడపిల్ల
అత్తింటికి పంపగనే చుట్టమెపుడు అయ్యిందో
అనుక్షణం నిరీక్షణే పసి రూపం చూసేందుకు
కన్నపేగు తీపి తపన గుండెనెపుడు తాకిందో
ఆశయినా ఆస్తైనా పిల్లలే ప్రపంచములే
తపియిస్తూ తినిపిస్తూ ఆకలెపుడు తీరిందో
అమ్మా" అని పిలుపు విన్న ఆ జన్మే ధన్యములే
ఓర్పు, నేర్పు పాఠాలను ప్రాణమెపుడు నేర్చిందో-
మాటకు రుచి ఉంటున్నది తాను పలుకుతున్నప్పుడు
మౌనం బాగుంటుందీ తాను అలుగుతున్నప్పుడు
దూర తీర దారులైన సమయ మసలు తెలియదులే
చెలి నీడలు నా అడుగుకు జతను కలుపుతున్నప్పుడు
ప్రతి రాతిరి జగడాలే తారకతో తామసితో
నా కలలను దోచేస్తూ తాము వెలుగుతున్నప్పుడు
చిరుగాలిని మోయలేని చింత ఒకటి కమ్మునులే
చిరు కోపం చూపి తనే చేయి వదులుతున్నప్పుడు
ఇరు సంధ్యలు మారుతున్న కలమసలే కదలదుగా
నా నెచ్చిలి మచ్చికలో మనసు చిక్కుకున్నప్పుడు
-
కురిసెను చిరు చినుకులు
తిరిగెను చెలి మెలికలు
తీయనైన మాట పలికి
తొలిగెను అరమరికలు
-
పతనమైన ప్రతిసారీ ఉదయించావ్ ఓ నాన్న
పడిలేచిన కెరటంలా కనిపించావ్ ఓ నాన్న
గొంతు చాటు ప్రేమ మూట..పైనే గంభీరమట
కసిరిన నీ గుండెనెంత బాధించావ్ ఓ నాన్న
నీ ఎదపై నిదురించిన చిరునవ్వుల దివ్వెలను
అలసిన నీ కథతోనే వెలిగించావ్ ఓ నాన్న
దూర తీర కలల వైపు లాగే మా మది నావను
నీ స్వేదమె ఓ నదమై నడిపించావ్ ఓ నాన్న
పగలంతా రవి చింతను ఎవరడిగారని సంధ్య
అస్తమిస్తు నే కన్నులు తెరిపించావ్ ఓ నాన్న-