నీ మాటల్ని భరిస్తున్నారంటే
నువ్వంటే ఇష్టమని
నువ్వు ముఖ్యమని
నీ మౌనాన్ని కూడా భరిస్తున్నారంటే
నువ్వంటే ప్రేమని
నువ్వు మాత్రమే ముఖ్యమని-
మాటల ప్రవాహంలో పడి మునిగిపోయే
బహిర్ముఖుణ్ణి కాదు నేను
ఆ సంద్రంలో మూగ నావ కట్టుకుని
మునగకుండా తప్పించుకునే అంతర్ముఖుణ్ణి నేను
-
ఏమంటూ వచ్చావో
నా జీవితంలోకి
ప్రతిక్షణం ఓ రెప్పపాటున
గడిచిపోతోంది
ఆ క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలై
మది దోసిలి నిండిపోతోంది
ఎదురొచ్చే ఏ కష్టానికీ
మనసు బెదరనంటోంది
పక్కన నువ్వున్నావనే ధైర్యం
వేసే ప్రతిఅడుగుపై ముళ్ళు
ఎగిరిపడుతున్నా
కూడా వచ్చే నీ అడుగులు
చూసి పూదారై వెలుస్తుంది-
ఆకాశవీధికి ఎగరేసుకెళ్లే కీలుగుఱ్ఱాలు
తడారిన మది గుండెకు మరీచికలు
తొలచగల వడ్రంగి పిట్ట చేతలు
వలచగల మన్మధ మంత్రవచనాలు-
మౌనాల కార్చిచ్చులో పడి రగిలి పోయే
విహంగాన్ని కాదు నేనూ..
ఆ కార్చిచ్చుపై అక్షర వర్షాలను కురిపించి,
చివురులు మొలకెత్తించే ఆకాశం నేను..!!-
మంచులాంటి మాటలకి పొంగిపోతూ
మురిసిపోయే అతివని కాను నేను...
ఆకతాయి మంచు మాటల్ని కరిగిస్తూ
ఆటకట్టించే అక్షరాల జ్వాలను నేను...
-
అంతుచిక్కని అర్థాలేన్నో
అద్దుకున్న అందాలెన్నో
విరబూసిన వర్ణాలెన్నో
పంచుకున్న భావాలెన్నో
దినచర్యలో భాగాలెన్నో
పరవశించిన పదాలెన్నో
-
నా నాలిక పలకనంతవరకే
నీ మాటలకు విలువ..
నా ఓపిక నశించనంతవరకే
నీ పేరుకొక గౌరవం..
నా చేయి తిరగబడనంతవరకే
నీకు పరువూ ప్రతిష్ట..
నా ఆలోచన నిన్ను ఎదిరించనంతవరకే
నీ పెత్తరికాలు, చెల్లింపులు..!!
నా ఎఱ్ఱనైన కనుచూపుల వేడికి
ఏడు సముద్రాలే ఆవిరావుతాయి..
నాకు నువ్వో లెక్కా..??
-