నానీలు
మౌనాలను
మనసులోకి వొంపా...
అదేంటో
కళ్ళలో అలలుగా ఎగిసాయి!
సుమన ప్రణవ్-
కనులు వేకువ దృశ్యకావ్యం
Postgraduate in physics
Divisional Panchayat offi... read more
అంతం కానీ మరణం...
ఊపిరోసుకొనే పునర్జన్మై మాడిన డొక్కల శ్వాసలో
పురుడోసుకోవాలి జీవనం!
అంతం కానీ దాస్య శృంఖలం...
తెగించిన ఆవేశమై కాలిన గుండెల రోదనలో జ్వలించాలి రుధిరం!
అంతం కానీ మానవ మృగం...
సైసై అంటూ సమర శంఖమై దౌర్జన్యంపై
జూలు విదించాలి నవ చైతన్యం!
అంతం కానీ చపలత్వం...
అటు ఇటు కదలని ధ్వజస్థంభమై
ఆశయ సాధనలో కదం కలపాలి ధృడ సంకల్పం!
అంతం కానీ అమాయకత్వం...
దారికాచి దోచే దోపిడి కొమ్ము విరవాలి పిడికిలి బిగించిన ధైర్యం!
అంతం కానీ నిర్లక్ష్య నిజేస్తం...
కన్నెర్ర చేసే కాంతి ఖడ్గమై రాబందుల రెక్కలను
చప్పున విరవాలి నవతరం!
సుమన ప్రణవ్
-
నానీలు
ఎన్ని కలలను
రాల్చిందో శిశిర వనం...
చైత్రాన్ని
రెమ్మలకెత్తింది రుతురాగం
సుమన ప్రణవ్
-
చీకటిదేమంత
కఠిన హృదయం...
నెలవంక నవ్వుకే
కరిగినది చోద్యం!
సుమన ప్రణవ్-
రాతిరి సిగలో
ఎన్ని తారకలో!
శ్వాసలు స్వప్నాలై
అర విచ్చినట్టు!
సుమన ప్రణవ్-
అవని
అలసినట్టుంది...
ఆకాశం బజ్జోమంటూ
మంచు దుప్పటి కప్పింది!
సుమన ప్రణవ్-
మెలుకువ గీతం
ఒసేవ్! ఏమేవ్...కాదు
నేను బహువచనం
అదీ! ఇదీ ! కాదు నేనో బహుళవచనం!
అంతులేని ఆకాశానికి సమానార్థం!
చీకటి కుహరంలో వెలుతురు మొగ్గగా
నిను మోసిన గాంఢీవ కవచం!
కనులలో తుఫానులను మోస్తూ
ఉషోదయాలను పురుడోసుకొనే సంద్రాల తీరం!
నేను ఏకవచనం కాదు
వసంతాలును నుదిటికెత్తుకొనే స్వప్నారణ్యాల వర్ణం !
ఒంటరి యుద్ధాలలో గెలిచి ఎగిరే శ్వేత పతాకాల గర్వం!
నెత్తుటి గాయాలతో కవాతు చేసే ఆత్మ విశ్వాసాల కదనం!
నిన్నటికి రేపటికి మధ్య జ్వలించే కాంక్షా స్వప్నం!
నేనో ఏక వచనం కాదు...
కాంతి బాట సోలని భూదిగంతం!
నేను... ఏక వచనం కాదు
కరుణ మరువని మెలుకువ గీతం!
సుమన ప్రణవ్-