సదా నన్ను నడిపే నీ చెలిమే
నీలిమేఘమై నిలిచే
ప్రతి చినుకు ఇకపై వర్షించి
నీ పేరే పలికే
ఇదే కోరుకున్న
ఇదే కోరుకున్న అని మనసే తెలిపే
అడుగు నర్తించగా నీ పేరుతో జతై
రాగం పలికించదా నీకోసమై
తాళం మురిపించదా నీ చెలిమిగీతమై
-
గలగలల గోదారిలా గెంతనా?
తూగుతున్న తుంగభద్రలా తుల్లనా?
పువ్వుల పలకరింపుకు పులకించాడనా?
చిగురాకుల చిరుగాలికి చిందేయ్యనా?
నల్లనిరేయిలో నెరజాణనై నర్తించినా?
నింగికిి నగుమోమునంటించి నాట్యమాడనా?
తనువు తన్మయంతో తేలి ఆడనా ?
వయ్యారాల వర్ణాలని వొలికి ఆడనా?
అందెల్లో అందాలను అలికి ఆడనా ?
వేళ్ళనే విరులుగా విరిసి ఆడనా ?
జలములో ఝషములా జారి ఆడనా?
వెన్నెల్లో వన్నెలొలుకు వయ్యారిలా ఆడనా?-
తాళం చేసే తప్పెటకి
రాగం పాడే సరిగమలకి
భూమాతను తడుముచు
నీవు నర్తించే అడుగులే
వాటికి నీవు తీర్చే రుణ సన్మానాలు
-
ప్రతీ పదము ఒక భావమే
ఆ భావాన్ని హావభావాలతో
హస్త ముద్రలతో తెలియజేస్తూ
తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ
మమ్ము మేము మైమరచి ప్రదర్శించే నృత్యము
మాకెల్లప్పుడూ ప్రత్యేకమే-
పతాకమున నాట్యమును ఆరంభిస్తూ
త్రిపతాకమున తిలకము దిద్దుకొనుచు
అర్ధపతాకమున గోపురమును మ్రొక్కుచూ
కర్తరీముఖముతో కన్నీటికి సమాధానమిస్తూ
మయూరమును పెట్టి నెమలితో పోటీ పడుతూ
అర్ధచంద్రమున దేవాదిదేవులను అభిషేకిస్తూ, ధ్యానిస్తూ, అర్థిస్తూ
అరాళమున వీచేగాలి ప్రచండమును తెలుపుతూ
శుకతుండముతో బ్రహ్మాస్త్రం వేస్తూ
ముష్ఠిన దానం చేస్తూ
శిఖరముతో ధనుస్సును ఎక్కుపెడుతూ, నిశ్చయ నిశ్శబ్ధాలను గమనిస్తూ
కళామాత నీ చంద్రకళ ముద్రలో కొలువుదీరినట్లు
సర్పశీర్షమున పాము పడగిప్పినట్లు
సింహముఖమున అడవిరాజు గాంభీర్యాన్ని
సోలపద్మమున విరిసిన తామరను
అతిసుందరంగా అడుగులు జతచేస్తూ
తాళయానుగుణ్యమై రసాభావములు నీ కన్నుల చేరి అభినయిస్తూ
వేసే ప్రతిఅడుగు నటరాజస్వామికి నీవు అర్పించే ప్రియ నీరాజనమే
-
సప్తస్వరాలు నలుదిక్కులను అలంకరించు వేళ
ఆ మువ్వల సవ్వడితో నీ అడుగులు
జతకట్టు వేళ
అభినయం నీ కళ్ళలో నర్తించు వేళ
ఏనాటి కలో ఇది.... ఈనాటికి, నీ కళే ఇది
-
ఎన్నెన్నో పాత్రలనూ మోసానూ నాట్యంలో
నాలోనే ప్రపంచాన్ని చూసానూ నాట్యంలో
ఆ కృష్ణుని వలపులోన పరవశించి ఆడానూ
రాధనయ్యి నన్ను నేనె మరిచానూ నాట్యంలో
మౌనంగా ఉంటూనే కథలన్నీ చెప్పేస్తూ
మనసుని తాకే కళనూ కలిసానూ నాట్యంలో
అనేకంలొ ఏకమయ్యె ఓ పథమే నాట్యమైతె
లీనమయ్యి నన్ను నేను గెలిచానూ నాట్యంలో
కష్టమైన ఇష్టముంటె హర్షంగా జరిగేనూ
మనసు పెట్టి ప్రయత్నించి వెలిగానూ నాట్యంలో-
అధరములే పదములై
పలుకుల అడుగులతో
భావమునే హావభావాలుగా అభినయిస్తూ
నర్తిస్తున్నా నన్ను నేను మైమరచి-