మన చేతి వేళ్ళ సాంగత్యమే
మన అరచేతి రేఖలలోని బంధాన్ని బలపరిచేది
మన తనువుల తాకిడిలోని వెచ్చదనమే
మన మధ్యన చేరిన పొరలను కరిగించేది
— teluguhw-
ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి
మరెన్నో పోరాటాల్లో బలైపోయి
మీరు మాకిచ్చిన ఈ స్వేఛ్చా స్వాతంత్ర్యం
ఈరోజు జరుగుతున్న ఈ దారుణాలకి స్వేఛ్చని ఇవ్వడానికా ?
ప్రతి చోట జరుగుతున్న ఆ మానభంగాలకి స్వతంత్రం కల్పించడానికా ?-
దారులన్ని సాఫీగా కనిపిస్తున్న
దాగి ఉన్న అడ్డంకులేవో దాటకుండా ఆపుతున్న
ఈ ప్రయాణం ఏ తీరానికో ఎందుకో తెలియకపోయినా
నడిచి నడిచి పాదాలు నలిగిపోతున్నా
ఈ నడక మాత్రం నత్తలానో నక్కలానో సాగాల్సిందే-
పోషించే ప్రతి పాత్ర
నాయకుడిని చేయలేదు నిన్ను
ప్రతినాయకుడినీ చేస్తుంది
ప్రతీకారాల నడుమా పడేస్తుంది-
స్వార్థం లేని రాజకీయ నాయకుడెవడూ లేడు
ప్రజా సేవే పరమార్థమని భావించే సేవకుడెవడూ లేడు
ప్రజా ధనాన్ని కొల్లగొట్టని పార్టీలేవీ లేవు
పథకాలని ఎరవేసి గెలవని ప్రభుత్వాలేవీ లేవు
సమర్థుడైన నాయకుడెవరో చూడు
సరైన పాలన చెయ్యగలిగే సత్తా ఉన్న నాయకుడిని చూడు
“దొంగల్లో మేలురకం దొంగెవడో చూడు”
ప్రలోభాలకు లోను చేసినా
పరిస్థితులను పరిసరాలను
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూడు
మీట నొక్కే క్షణాన
నీలో నిదరోయిన మేధావిని అడిగి చూడు-
తెగిపడిన ముక్కల లెక్కలెన్నో
చెల్లాచెదురైన దేహపు ముద్దలెన్నో
మిగిలిన ఈ సగ ప్రాణాల సంగతేంటో
తరాలు మారినా మానిపోని
ఈ మూర్ఖపు మూకలు చేసిన గాయాల గురుతులేంటో
ఊపిరున్నా
స్వేచ్ఛగా పీల్చలేని ఈ విషపు గాలులేంటో
ప్రాణమున్నా
పంతాల నడుమ ఈ విద్వేషపు బ్రతుకులేంటో-
నా మది కాగితాల నడుమ నలిగి వాడిపోయి మిగిలిన
పూవుల గుబాళింపులు తన తలపులు-
జనారణ్యం మూగబోయిందంటే
రాజ్యాధికారులు అణచివేతలోనైనా ఆరితేరిపోయుండాలి
అవసారానికి మించిన పథకాలను అమలైనా చేసుండాలి
అసమర్థ పాలనకి విసిగి అలిసిపోయి నిద్రలోకైనా జారుండాలి-
ఒకనాడు నీ పాటలల్ల
ఆ నాయకుడ్ని నరికినోడివేగా
ఈనాడు అదే పాట ఆ నాయకుడ్ని
నడిపించి గెలిపించడానికి అమ్ముడుపోయిందా ?
ప్రజాపోరాటం పేరుతో
నీ ఇంటి ఒంటి అస్తిత్వానికై
ఆడిన పాటల ఆటలేగా అన్నీ ?-
ఎన్ని జాములు జారిపోతున్నాయో లెక్కే లేదు
మనిద్దరి ఈ మూగ ప్రేమల బాసలు వింటూ
రేతిరేళ ఆ గుట్టుచప్పుడు కాని మన సైగలు కంటూ-