కమ్మనికల కనడమెలా చూపినజత కనుకు నీవు
ఆశలలత వాడదలా ప్రేమామృత చినుకు నీవు
మునుపెరుగని మదినిచూపి నీడలాగ వెంటనడిచె
నింగిలోని చందమామ జంటతార తళుకు నీవు
మాటలన్ని పాటలాగ బాణికట్టి వినిపించే
మనసులాగ ననుచేరిన రాగాలా కులుకు నీవు
అలసిసొలసి దిగాలుగా ఎపుడైనా ఉండుంటే
నేనుండగ చింతేలనె చిరునవ్వుల పలుకు నీవు
నునులేతగ తనుతాకే తొలి'సంధ్యా' కిరణముకై
ప్రతివేకువ హృదిలోపలి పరితపనల కునుకు నీవు-
ఇరుకన్నుల పులకింతలు ఎదుటేమో తానుకదా
మనసుగువ్వ కేరింతలు మధువేమో తానుకదా
ప్రతి వేసవి రాత్రులలో పరిమళించు మల్లెలలో
దండగుచ్చి దాచుకున్న వలపేమో తానుకదా
చలిగాలులు వీస్తున్నా చిరు చెమటై నే ఉన్నా
చిత్రంగా గిల్లినట్టి తలపేమో తానుకదా
మునుపెరుగని నాకు నేను సరికొత్తగ పరిచయాన్ని
వినిపించెను సరాగమై స్వరమేమో తానుకదా
మందారపు దారులలో అందమైన "సంధ్య"ల్లో
వందేళ్లను కలగన్నా వరమేమో తానుకదా
-
నీ కవితలు చదువుతుంటె కరిగిపోని మనసుందా
గుండెలనే పిండుతావు తరిగిపోని వ్యథ ఉందా ?
సుమాలకే అసూయలే సుకుమారం నీ సొగసే
కన్నులేమొ ఎరుపాయెను చెరిగిపోని కలతుందా?
చెలిమి చేను లోన నీవు చందనాలు పంచుతావు
శోఖమెంతొ స్వరంకిందె కలుసుకోని కథ ఉందా?
చిరుజల్లులు నిశిరాత్రులు రహదారులు ఆ కొండలు
అందాలను బంధిస్తావ్ మరచిపోని గతముందా?
తన ఆశలు తన కోర్కెలు తెలుసు కదా ఓ సంధ్యా
నిజం అయ్యి నెగ్గాలని కోరుకోని రోజుందా
-
నిశ్శబ్ధపు చీకట్లను అలుముకుంది పాఠశాల
పిల్లలెవరు కానరాక గోముగుంది పాఠశాల
వేలుపట్టి దిద్దించే అనుభూతులు దూరమైన
గురువులతో తను కూడా అలిగివుంది పాఠశాల
గణ గణ మని మోతేదని కొక్కానికి వేలాడుతు
బడిగంటే అడుగుతుంటె గమ్మునుంది పాఠశాల
కమ్మనైన వంటకాల ఘుమఘుమలే లేకపోయె
వంటశాల కళకళకై వేచివుంది పాఠశాల
ఆట పాట చదువుసంధ్య లన్నింటికి నెలవైనది
బడిసంచుల స్పర్శలనే అడుగుతుంది పాఠశాల-
కన్నులలో మిన్నులలో కనిపిస్తూ నీవులే
తిన్నెలలో వెన్నెలలో నడిపిస్తూ నీవులే
ఇన్నినాళ్ళ కలలెలాగ ఒంటరిగా కరిగెనో
గుండెగుడిన గువ్వలాగ విహరిస్తూ నీవులే
ఈ చినుకుల చలువదనం తెలియలేదు తనువుకే
చెంతనిలిచి కనుసైగతొ ఒణికిస్తూ నీవులే
ఊపిరెనే గాలులెలా నిలిపినవో తెలియదే
మది తేలే పరిమళాలు పంచిస్తూ నీవులే
ఆకసాన అరుణమయం సుందరమై ఆ సంధ్య
నీ పాపిట సింధూరం తలపిస్తూ నీవులే
-
గాయం చేసే గతముల కన్నా మరుపే అందం
గమ్యం తెలియని నడకల కన్నా మలుపే అందం..
రంగులు పూస్తూ నవ్వులు అద్దిన మోముల కన్నా
చేనులొ అలసీ చేతులకంటిన నలుపే అందం...
దైవంమీదే భారంవేస్తూ ఊరికె ఉండక
మన పని చేయగ శ్రమలో వచ్చే అలుపే అందం..
పోతేరానీ సంపదనంతా చాటుగ దాయక
అడిగిన వానికి ఆకలి తీర్చిన గెలుపే అందం..
చదువుసంధ్యలూ నేర్వకపోయిన తోటివారితో
తగువు తెలియదని మనకే అందిన పిలుపే అందం ..
-
ప్రాణమంత నొక్కిపట్టి ఆపినట్టు ఉందినాకు
బ్రతుకురాత కక్షగట్టి రాసినట్టు ఉందినాకు
వేధిస్తూ వాదిస్తూ ఓర్పునంత ఒలిచేస్తూ
శిథిల మైన శిలనింకా చెక్కినట్టు ఉందినాకు
గాయాలను గతబాధను కప్పిపెట్టి వస్తున్నా
నీడలాగ వెంటపడీ తరిమినట్టు ఉందినాకు
కవనాలను పవనాలతొ సాగాలనె నా మనస్సు
కన్నీరుల కొరివితోని కాలినట్టు ఉంది నాకు
కరుగుతున్న అరుణ సంధ్య కలుపుకోను ప్రేమతోని
అలసిన నా శ్వాసలనూ పిలిచినట్టు ఉందినాకు
-
మకరందం తుమ్మెదలకు ఇవ్వననే పువ్వుందా
అనుబంధం ఏ ఎదలను చేరననే వీలుందా
కిలకిలమని నిదురలేపి ఎగిరెళ్లెను కొంటెపక్షి
రోజంతా ఎటెళ్ళిందొ చేరకనే కొమ్ముందా
ఒడిదుడుకులు ఓటమీలు గాయాలవి ఎన్నెన్నో
ఓర్పు నేర్పు కూరిమితో దాటకనే బ్రతుకుందా
కలలేవో చెరిగాయని కన్నీళ్లే రేయంతా
మునుముందుకు పోదామని మారమనే మనసుందా
తొలిసంధ్యన ప్రతిరోజొక జన్మమనే నా యోచన
కలహాలను కోరు మదికి శాంతమనే రోజుందా-
పచ్చనైన పొలం గట్టు నెగురుతోంది నా మనస్సు
మెచ్చుకోలు కవితలకై వెతుకుతోంది నా మనస్సు
మేఘాల్లో ఆ గాల్లో రాగాల్లో విహరిస్తూ
పయనంలో పాటలనే పాడుతోంది నా మనస్సు
నీలి నింగి చుక్కలలో దాగి ఉంది మాయేదో
రేయిలలో చంద్రునిలా తేలుతోంది నా మనస్సు
కారణాలు కాగితాలు అసలు కడకు మన గాథలు
కానరావు మైత్రి పథమె కోరుతోంది నా మనస్సు
పసిపాపల నవ్వులలో తెలవారే తొలిసంధ్యలొ
ఉత్తేజం దొరుకుచోటు చూపుతోంది నా మనస్సు
-
మామూలుగ మాటలన్ని కలపగానె కవితౌనా
పదాలేవొ జోడిస్తూ తెలపగానె కవితౌనా
నీ ఊహల లోకంలో రంగుల తెర తొలగించక
పాఠకున్ని గడపలోన నిలపగానె కవితౌనా
వసంతాన కోయిలమ్మ రాగాలకు మురిసినట్టి
మది భావం మౌనంగా తలవగానె కవితౌనా
తారకలను దారంతో మాలలుగా అల్లినట్టి
కొంటెతలపు గుండెలోన దాచగానె కవితౌనా
సందెపొద్దు వాలుతుంటె నింగికెంత ఆనందమొ
ఆ అందం నింపకుండ రాయగానె కవితౌనా
-