నా కలల్ని ఒడికట్టీ పోగేస్తా ఓ సఖుడా !
అడిగి చూడు ఒకసారీ ఇచ్చేస్తా ఓ సఖుడా !
నీ ఉనికే చాలు నాకు మనసున చోటివ్వకున్న
కళ్ళెదుటే ఉంటావా బతికేస్తా ఓ సఖుడా !
నీ ఊహల జాబిల్లిగ నిలవాలని ఉంది నాకు
నీ స్వప్నపు చీకట్లను చెరిపేస్తా ఓ సఖుడా !
ఎర్రటి ఆ సింధూరం నా నుదిటిన దిద్దకున్న
నల్లటి దిష్టిచుక్కనై వెలిగేస్తా ఓ సఖుడా !
ఎన్నెన్నో పాత్రలతో నడిచేదే అందరి కథ
నీ పేజిని ఖాళీగా ఉంచేస్తా ఓ సఖుడా !
ఈ జన్మలొ సాఫల్యం అవ్వకున్న మన బంధం
పరిచయమే వరమంటూ పొంగేస్తా ఓ సఖుడా !
ఎంతెంతో సంపదనూ మోస్తోందీ శ్రీహర్షిత
నా ప్రేమను నీ పేరున రాసేస్తా ఓ సఖుడా !-
మునుపు క్షణపు ముళ్లపొదను మరిచానూ నిన్ను చూసి
ఎడబాటుపు ఎదబరువును మరిచానూ నిన్ను చూసి
ప్రతి గాలిలొ పరిమళాన్ని ఓ కబురే అనుకుంటూ
నీ ఊపిరి మత్తుల్లో మునిగానూ నిన్ను చూసి
కళలున్నా కలలుకనక రాయినయ్యి మిగిలానూ
మారిన ఓ అహల్యనై కదిలానూ నిన్ను చూసి
సంద్రమిలా కలవగానె చినుకు ఉనికి చినబోయే
నన్ను నేను దాచుకోక కురిసానూ నిన్ను చూసి
శ్రీహర్షిత కలంలోని సిరాకింక చోటులేదు
నువు దిద్దిన కాటుకతో వ్రాసానూ నిన్ను చూసి-
జవాబులే లేవంటే కాగితమే ఖాళీగా!
రాయాలని లేదంటే పుస్తకమే ఖాళీగా!
చెయ్యాలని కోరికుంటె ఏదైనా సాధ్యమేగ
ఆశ నీకు లేకుంటే ఆకసమే ఖాళీగా!
బతుకంటే యుద్ధమేగ నీలోనే ప్రతీ క్షణం
విలువ నీకు తెలియకుంటె యవ్వనమే ఖాళీగా!
అందరికై తనొంటరై కదిలెనులే సడి చెయ్యక
మనకిచ్చీ వర్షాన్ని ఆ మేఘమే ఖాళీగా!
ముళ్ళు కూడ అందమేలె ఇచ్చేదీ రక్షనైతె
మంచి మనసు లోపిస్తే సుందరమే ఖాళీగా!
బాధనేది ఉంటుందా ప్రేమే నీ తోడైతే
వలపు నీకు దూరమైతె వసంతమే ఖాళీగా!
ఏదున్నా లేకున్నా హర్షితమే ముఖ్యముగా
సంతృప్తే లేకపోతె జీవితమే ఖాళీగా!-
రాలుతున్న చినుకుల్లా విరిగిపోవు జ్ఞాపకాలు
కిందపడ్డ కెరటాల్లా అతికిపోవు జ్ఞాపకాలు
యే సిరాను వాడారో తెలియదు ఆ బ్రహ్మగారు
చేతి మీద గీతల్లా చెరిగిపోవు జ్ఞాపకాలు
రేపటికీ నేడు నిన్న, మనసు రంగు మారలేదు
కొత్తదనపు బూజుపట్టి వెలిసిపోవు జ్ఞాపకాలు
గుచ్చుకున్న మెచ్చుకున్న రోజాపువ్వొకటేలే
నాణేనికొ నాణెమంటు చెల్లిపోవు జ్ఞాపకాలు
జ్ఞాపకాల మెప్పుకనా? రాస్తున్నావ్ శ్రీహర్షిత
నీ రాతల మధ్యపడీ నలిగిపోవు జ్ఞాపకాలు-
నలుగురితో కలిసుండే మనసేగా ఆభరణం
కలల వెంట పయనించే వయసేగా ఆభరణం
మొదలనేది అన్నింటికి ఉంటుందిగ ఓ చోటా
పలువురినీ నడిపించే అడుగేగా ఆభరణం
భావమెంతొ లోతైనా అలవోకగ చెప్పేస్తూ
దేనికైన రూపమిచ్చు కలమేగా ఆభరణం
నలుపైనా తెలుపైనా రంగులోన ఏమున్నది
అందరికీ పెట్టగలిగె గుణమేగా ఆభరణం
ఎంతెత్తున నుంచున్నా సంద్రానికి కొరవుందా
జీవితాన్న నేర్చాలనె తపనేగా ఆభరణం
క్షణములోన వదిలిననూ విలువెంతో ఉన్నదిగా
ఆలోచనతో కూడిన మాటేగా ఆభరణం
లౌకికాలు ఏవైనా చిరకాలం ఉండవుగా
నీకంటూ హర్షమ్మా నువ్వేగా ఆభరణం-
రాత్తిరన్న జాబులన్ని మోస్తువుంది నలుపుతనలొ
రాతిమనిషి విమర్శలని మోస్తువుంది నలుపుతనలొ
రంగులోన వెలితి వెతుకు అక్షువులే మనవి కదా
మన మనసుల శూన్యాన్నీ నింపుకుంది నలుపుతనలొ
విశ్వమంత వ్యాపించిన అమావాస్య కానరాదు
లోకమెరుగని నృతాన్నీ దాచుకుంది నలుపుతనలొ
మచ్చలన్ని జాబిలికే నల్లయ్యకు మచ్చెక్కడ
తప్పులేని నిందలనూ ఇంపుకుంది నలుపుతనలొ
నలుపే ఓ శోకమైతె నవ్వు విలువ తెలిపెదదే
శ్రీహర్షిత నవ్వులన్ని చేర్చుకుంది నలుపుతనలొ-
కృష్ణయ్యా చరణాలను చేరేటీ పూవులెన్నొ
రాధమ్మా సిగలోనా మురిసేటీ పూవులెన్నొ
కోటలేవి కోరదులే నీ తోడుకొ గురుతు తప్ప
అలసిన ఆ ఆలి కొరకు తెచ్చేటీ పూవులెన్నొ
ఏ గాలితొ ఏ వైరం మోసాయో ఏ జనమలొ
తమ గూటిని వదిలి నేల రాలేటీ పూవులెన్నొ
తన మనసుకు ఓతోడుగ అంపెనుగా ఆనాడూ
చదవని ఆ లేఖల్లో నలిగేటీ పూవులెన్నొ
కొమ్మనుండి కోసివేసి ఎంత గాయపరిచిననూ
ద్వేషమొదిలి పరిమళాన్ని పంచేటీ పూవులెన్నొ
జ్ఞాపకాల తోటలోన వికసించిన కుసుమాలూ
సమాధిపై కాలంతో వాడేటీ పూవులెన్నొ
ఏ పుట్టుక యెందు కొరకొ పైవాడే తేల్చిచెప్పు
శ్రీహర్షిత కవితలలో మెరిసేటీ పూవులెన్నొ-
ఉన్నానను ధైర్యాన్నీ ఇస్తావని వేచున్నా
నా వ్యధనూ చూడలేక వస్తావని వేచున్నా
నువ్వు లేని వెలుతులలో ఒంటరినై నే నడవగ
కనపడనీ నా నీడవి అవ్తావని వేచున్నా
గుర్తొచ్చే ప్రతి సారీ ఓ నవ్వుని నవ్వుకుంట
పంచుకునే చిరుగాలిల వీస్తావని వేచున్నా
ఇరువురమూ కలిసివున్న చిత్రాలూ ఎన్నెన్నో
మేఘాల్లో మన బొమ్మలు గీస్తావని వేచున్నా
అంతులేని ఆకసాన్న అందమైన ఓ తారగ
వెలుగుతు ఈ హర్షితనూ చూస్తావని వేచున్నా-
వెళ్లాలని లేకున్నా కష్టంగా వెళ్తున్నా
నాకు నేను విలువనిచ్చి ఇష్టంగా వెళ్తున్నా
కవిత కలిపిన హృదయాలు ఎన్నో మరి ఎన్నెన్నో
అక్క, అన్న అంటు పిలువు బంధంగా వెళ్తున్నా
కన్నీటిలొ నన్ను అక్కున చేర్చుకుంది నా కలం
అక్షరాన్ని విడవలేక భారంగా వెళ్తున్నా
మనసుని నొప్పించే ఘటనొక్కటైన చాలు కదా
ఓర్చలేక ఈడ్చలేక దూరంగా వెళ్తున్నా
గాయాలన్ని పాఠాలె ప్రతి చోటా జ్ఞాపకాలె
నిట్టూర్పు విడిచి ముందుకు హర్షంగా వెళ్తున్నా-
అక్కడనీ ఇక్కడనీ వేటిలోనె వెతుకుతావు
తిరుగుకుంటు తిరుగుకుంటు అలుపులోనె వెతుకుతావు
పేరు అనీ పరువు అనీ ఎంతెంతకి ఎగురుతావు
ఋతువులతో మారిపోయె వాటిలోనె వెతుకుతావు
నీకు నువ్వు బానిసయ్యి భ్రమలోనే బతుకుతావు
మద్యమనీ ఆడదనీ ఇచ్ఛలోనె వెతుకుతావు
ప్రేమంటూ ద్వేషమంటు మనసంతా నింపేస్తూ
బంధమనీ బాధ్యతనీ వాటిలోనె వెతుకుతావు
అక్కడనో ఎక్కడనో హర్షమసలు ఉండదురా
చివరకి మరి తెలుసుకో నువు నీలోనె వెతుకుతావు-