రాముడు జన్మించిన చైత్రం
లక్ష్మీ గా అరుదెంచు వసంతం
రామ.... లక్షిల ఆగమనం
రామలక్ష్మి గా ఉగాది ఉత్సవం-
ఏటా దేవుళ్ళకు బ్రహ్మోత్సవాలు
ప్రకృతి ఉత్సవం
వసంతం
కాలమే దైవం
కాలం అమ్మ
ఆ దైవాన్ని
స్మరించుకోవడానికి
నవ రాత్రులు
వసంత నవరాత్రులు-
మనమాతృభాష ఉనికి
ప్రమాదంలో ఉందని
భాష అభివృద్ధికి
అసలు ఆస్కారం
లేనే లేదనుకునేవారికి
నాటు నాటు పాటతో
అదరగొట్టేసి చిందు
చూపించి చిందులేయించి
తెలుగు పై ఆశల మొలకలు
నాటు నాటు అని
ఆస్కార్ అవార్డ్ అందుకుని
విచ్చేసిన వసంతం ఈ ఉగాది-
ఆశలు చివురించాలని
చూపు లేలేత చివురులు
వగరు తిన్నా తీయగా
పలికే కోయిల తెలుపు
ఓ సరికొత్త పాఠము
వగరైనా చేదైనా
పలుకు తీయగానే
ఉండాలని….
గూడు ఏదైనా
గుణము ముఖ్యమని
శిశిరం వెళ్ళక తప్పదని
అరుదెంచిన వసంతం
చెబుతూంది….
పలుకుతూంది
శుభాకాంక్షలు-
వసంతం తెచ్చె ఉగాది
ఉగాది ప్రకృతి ఉత్సవం
తెచ్చెను ఉత్సాహం
మోసులు వేసె ఊసులు
మొదలాయె ఎన్నో ఊహలు
ఊహలు ఊగెను ఊయల
గొంతు సవరించె కోయిల
వినవచ్చె వసంత గానం ఇలా
సింగారించుకునె ఇల
పలికెను శుభాకాంక్షలు
-
కాలం గమనం దానినైజం
ఆగదు ఒకనిముషము
వేగంగా పురోగమనం
అనుసరిస్తే మనకు హితం
బహుమతిగా అందిస్తోంది
మరో కొత్త సంవత్సరం
వసంతం ప్రకృతి ఉత్సవం
-
ఈ నవ వసంతం
నవమి కోసమా
రామనవమి కోసమేనా
రాముడు జన్మించిన మాసం
చైత్రం ముస్తాబయ్యె
రామునికి స్వాగతాలు
పలకడం కోసం
భూమాత తన జామాత కోసం
పచ్చని తివాచీ పరచింది
వసంత గానం వినవస్తోంది
ప్రకృతి అందుకుంది కృతి
కాలగమనంలో అరుదెంచె
శోభాయమానమైన శోభకృతు-
రాలుపూతకు శోకించకు
పండుటాకులే రాలిపోవు
రాలిన పారిజాతాలే
పూజా కుసుమాలు
రాలిన కానుగపూలే
భూమాతకు పూజలు
అడుగడుగున అందాలు
ఋతురాగంలో అర్థాలు-
నిత్యసుందరి వసంతం
నిత్యానుపాయిని లక్ష్మి
యుగయగములో శ్రీహరితో
రాముని వెంట సీతగా
వసంతుడి వెంట శోభగా
నూతనసంవత్సరం శోభకృతుగా
శుభాకాంక్షలు పలుకుతూ శోభకృతు-
తొలకరితో చినుకులతో శుభారంభం
పన్నీటి చినుకులు చిలకరించె
ప్రకృతిలో వర్ణాలు రంగరించె
నా నయనాలు తిలకించె
హృదయము పులకరించె
తొలి వెలుగులు పలకరించె
నేస్తమా వసంతమా
నీ పలకరింపుతో
ఓ మంచి శుభోదయం
-