అనవరతం మా కోసం కదిలినావు ఓ జననీ
నిరంతరం మా క్షేమం తలచినావు ఓ జననీ
నువ్వొంపిన ఘర్మజలం నేలతల్లి కభిషేకం
మా కోసం తోటపనిలొ కరిగినావు ఓ జననీ
నాన్నకేమి చెప్పలేని నా కోరిక లెన్నెన్నో
నీ చెవితో పంచుకుంటె తీర్చినావు ఓ జననీ
భారములను తుడిచేయగ హారములను అమ్మినావు
గండాలను దాంటించి గెలిచినావు ఓ జననీ
వన్నెలోన్ని మలిచినట్టి మాతృమూర్తి వందనమే
నా కన్నుల దేవతవై వెలిగినావు ఓ జననీ-
సమస్త లోక శుభకరం పూర్ణమూర్తి శరణమహం
ప్రశస్త ద్వైత నాశకం జ్ఞానమూర్తి శరణమహం
గురుపుంగవ తత్వమతే మహా మాయ నాశకృతే
కరుణారుణ కిరణాలయ అభయమూర్తి శరణమహం
రచయాఖిల శాస్త్ర నిధే అనవరతం మే స్మరణం
విమల చరణ సరిద్గమన దయామూర్తి శరణమహం
మమ వారయ మహా మోహ విషయ పాన గుణదోషం
తరుణారుణ ముఖ కమలం ఏకమూర్తి శరణమహం
సుగతి నాస్తి సుమతి నాస్తి న చ వన్నెల శాంతి గురో
దేహి ప్రజ్ఞ శ్రీ శంకర దక్షిణమూర్తి శరణమహం
17/5/2021-
కవితలనే మొక్కలను నాటుతుంది సుమన చూడు.!!
శాంతులనే గాలులను పంచుతుంది సుమన చూడు.!!
భావాలను బాలికలే 'సీత చీర'తో మెరిసే
హృది గగనము హాయిగా తిప్పుతుంది సుమన చూడు.!!
గూడు వదిలి గువ్వలెగిరె సమయాలే కలములో
రెక్కలలో కర్తవ్యం తెలుపుతుంది సుమన చూడు.!!
అసలింతగ అక్షరాలు ప్రేమించే స్త్రీ ఎవరూ?
పుస్తకమే ఊపిరిగా బ్రతుకుతుంది సుమన చూడు.!!
వన్నెలయ్య హృదయంలో వాగ్దేవత ఈ తల్లీ
అక్షరాల రూపముగా కదులుతుంది సుమన చూడు.!!-
"వందే వాల్మీకి కోకిలమ్"
శోకాన్నీ శ్లోకంగా మార్చెనంట వాల్మీకి
గాయాన్నీ గేయంగా తీర్చెనంట వాల్మీకి
అడుగడుగున కన్నీళ్ళను కళ్ళాపిగ ఒలికించి
బాధలలో బోధలెన్నొ చిలికెనంట వాల్మీకి
పక్షి నొప్పి నోర్వలేని మర్యాదా పురుషునిలో
కరుణారుణ కిరణాలను చూసెనంట వాల్మీకి
మాటొక్కటి బాటొక్కటి నడిచినట్టి చరిత వ్రాసి
పరవశించి కోకిలయ్యి పాడెనంట వాల్మీకి
కొండ కోన వాగు వాన ఉన్న వరకు వినిపించీ
వన్నెలయ్య కవిత గుడిలొ వెలిగెనంట వాల్మీకి-
కండువ వెనక్కి ఎందుకు తిప్పాడో తెలిసిందా?
కళ్ళద్దాలతొ ఎందుకు చూసాడో తెలిసిందా?
తెలంగాణ తెలుగు భాష దినోత్సవ రోజున నీకు..
దారిలో కాళోజీ గొడవేమిటో తెలిసిందా?-
భారతమాత నుదుటిపై తిలకంలా ఉంటాడు.!
ఋషి పుత్రుల గుండెల్లో నమకంలా ఉంటాడు.!
ఎదురు లేదు వణుకు లేదు వెన్ను చూప లేదసలే
శివాలెత్తి ఆ కాళీ ఖడ్గంలా ఉంటాడు.!
దండయాత్ర లెన్ననూ ఈ సంస్కృతి రాల్చాలని
శ్రుతి పలికే మా భైష్టా శబ్దంలా ఉంటాడు.!
ఊరూరా కూడలిలో, సనాతనం హృదయంలో
గాండ్రించే అడవి రాజు సింహంలా ఉంటాడు.!
కాలగతిన మాస్తుందా వీర చరిత - వన్నెలోడ..
ఆరిపోని తొలి దీపం తేజంలా ఉంటాడు.!
19/2/2022-
ఖడ్గసృష్టి కడ్డుపడితె శిలువేస్తా నేనిప్పుడు
భావపుష్టి అగుపడితే అడుగేస్తా నేనిప్పుడు
పేద సాద కన్నులలో అభ్యున్నతి మెరుపులేవి
విప్లవాగ్ని గొంతుకనై నిలవేస్తా నేనిప్పుడు
రొదలు కనులు తిలకించిన యద కనుమల ఎరుపెక్కే
తిరుగుబాటు ప్రస్తానం మొదలేస్తా నేనిప్పుడు
ఏ కన్నూ చూడదనా చీకటిలో వేషాలను
జేబు దోస్తె లంచగొండ్ల కడిగేస్తా నేనిప్పుడు
వన్నెలయ్య మాట పాట విక్రాంతుల వేటనోయ్
సమ్యవాద సంరావం చేసేస్తా నేనిప్పుడు
14/06/2021-
మండిన గుండెల స్మరణము అల్లూరి.!
ప్రచండ విప్లవ కిరణము అల్లూరి.!
శస్త్ర శాస్త్రాలు నేర్చెను వేగమే
క్షత్రియ సాదువు తేజము అల్లూరి.!
బ్రిటీషు ప్రభుతల గుండెలు బెదిరేను
మన్యం తీర్చిన సింహము అల్లూరి.!
ఇంగ్లాండ్ దొరలకు నిదురను చెడిపెనూ
గుర్రము డెక్కల శబ్దము అల్లూరి.!
తిరుగుబాటునే ఉప్పెన చేయగా
హృదయం ఎగసే సంద్రము అల్లూరి.!
చావుకు జడవక రొమ్మును విరిచెనే
మరణం పొందని జననము అల్లూరి.!
వన్నెల గిరిజన కన్నులు చూడగ
ఉద్యమ దాడుల అస్త్రము అల్లూరి.!-
మగువ బ్రతుకు వెలిగించిన భవిత జాడ గురజాడ
వెలుగు పథము నిర్మించిన అడుగు జాడ గురజాడ
వనిత స్థితి మార్పు కోరి కలము కదిపె హేతువాది
స్త్రీ పక్షం సాహిత్యం రచన జాడ గురజాడ
ఈ సంఘం సంస్కరణం శ్రీ"శ్రీశ్రీ కవిత్రయం
పరివర్తన పల్లవించు ప్రగతి జాడ గురజాడ
రైతు యజ్ఞ శ్రమను చూసి చేయి కదపి సాగాలను
సమైక్యతా సహకారం నడక జాడ గురజాడ
ఉర్వి కులములన్ని కలిపి రెండు చేయు చరిత తనది
మంచి చెడులె లోకమన్న పలుకు జాడ గురజాడ
మతములన్ని మాసిపోయె లోకమేదీ? వన్నెలయ్య
కాంతి చూపే అక్షరాలే కవిత జాడ గురజాడ-
అన్నంటే ఆదర్శం తలచెనుగా నా మనసు.!
తన అడుగుల ముద్రల్లో నడిచెనుగా నా మనసు.!
మా గాథల వెతలన్నీ తుడిచింది ఆ కరము
అలపెరుగని శ్రమతోనే గెలిచెనుగా నా మనసు.!
నగదులేక నగవు చెడిన మోములపై కళలిప్పుడు
తన త్యాగం కారణంగ తెలిసెనుగా నా మనసు.!
క్రమక్రమం పెరిగెనుగా కన్నీళ్లూ, కష్టాలు
నీ శ్రమయే త్రివిక్రమం గాంచెనుగా నా మనసు.!
వన్నెలోడి పదబంధం అనుబంధం అల్లుకుంది
శుభప్రదం సాగాలని వలచెనుగా నా మనసు.!-