ఓ గణపతి నీవే మాకు గతి
విఘ్నాలు తొలగించు అధిపతి
వినిపించు నీనోట ఓ ఆనతి
తలొగ్గుతుంది దానికి నామతి-
బృందావన బాలుడంట
నా ఒడిలో చేరె చూడు.!
మంద గమన అడుగులతొ
వాకిటిలో ఆడె చూడు.!
దధీ మహా అమృతాలు
వాడి ముందు చేదు చేసి..
చంద్ర వదన మోముతోడ
కన్నులలో నిలిచె చూడు.!-
బతుకొక్కటి నాది
బలమంతా నీదేగా..
మాటొక్కటి నాది
మహిమంతా నీదేగా..
అడుగొక్కటి నాది
బాటంతా నీదేగా..
మనసొక్కటి నాది
వలపంతా నీదేగా..
గొంతొక్కటి నాది
గానమంతా నీదేగా..-
మది వాకిట పాడుతున్న గానాలే నా రాధా
యద లోగిట ఆడుతున్న ప్రాణాలే నా రాధా
అవని మాత పొంగిపోగ వేసెనుగా అడుగులనే
కమలాలై కదులుతున్న చరణాలే నా రాధా
మరపురాని వాలుచూపు అందాలే అస్త్రంగా
శరములతో గుచ్చుతున్న నయనాలే నా రాధా
ఉనికిలోన ఊపిరులై ఊరేగే ఊహలతో
చిలిపి తలపు తాకుతున్న పవనాలే నా రాధా
వన్నెలయ్య అసంగత్వ తలపులలో సంగమించి
క్షణమాగక మోగుతున్న స్మరణాలే నా రాధా-
నలుపు మెరుపు రేపింది ఒక మోహనాల కోరికను
మది గోపిక కోరింది నడిరాతిరాట కలయికను-
కృష్ణా..
సుందర చరణా..
నీ ధ్యాస తనువు మైమరపు
నీ ప్రేమ జగతి మరుపు
నీ లీల బోధ తెలుపు
నీ రూపు నీలి మెరుపు-
చెరపలేను ఇలలో నీ వ్యాపకాల సంతకాలు
మరవలేను కలలో నీ జ్ఞాపకాల సంతకాలు
వెన్న కుండ దొంగిలించి ఆత్మ తత్వ బోధ చేస్తె..
నిండి పొర్లు కన్నులలో సంతసాల సంతకాలు-
మనసు నమ్మిన మాట నీవే
వయసు కోరిన పాట నీవే
నాదు కథలో నీవు నిండగ
జతగ కలిసిన ఆట నీవే
స్మరణ చేస్తూ వదలకుండా
నేను నడిచే బాట నీవే
నాకు నేనే మేను మరిచే
ప్రేమ నిండిన కోట నీవే
కనులు మరవక వెతుకు చుండే
తరచి చూసే వేట నీవే
వన్నె లొలికే వలపు వెన్నెల
మదిన దాచిన మూట నీవే
"త్వయి ధృతాసవః దిక్షు త్వాం విచిన్వతే"-
ఎదలోతు గాయమును ఎదిగాను మొలకనై
ప్రేమనే నింపాను ప్రేమైన చిలకనై
తలపులే ముడివేసి తరిగాను గిలకనై
ముందుకే రానపుడు ముడిచాను అలకనై
నీకొరకు ఆశతో నిలిచాను వనమునై
ఒంటరై మట్టిలో ఒదిగాను అణువునై
కదిలిరా ఓకృష్ణ కలవాలి రాధనై
వన్నెలే నింపుకుని వలచాను కానుకై-