నేనెంత నా పొగరెంత?
నీ వాలు చూపుల్లో జారిపోయేంత...
నేనెంత నా కోపమెంత?
నీ కన్నీటి చెమ్మకే ఆవిరయేంత...
నేనెంత నా మనసెంత?
నీ కలవరింత ఆపుకోలేనంత...
నేనెంత నా బ్రతుకెంత?
నీ ప్రియమైన కౌగిలిలో కరిగిపోయేంత...
నేనెంత నా ప్రేమెంత?
నా అణువణువు నిన్ను దాచుకునేంత...
నేనెంత నా ప్రాణమెంత?
నీ ఊపిరిలో నన్ను నేను మరిచిపోయేంత...!!-
గంజి తాగలేము...బెంజిలో తిరగనూలేము
నడకనెంచలేము...షి'కారు' కొట్టనూలేము
నడుము వంచలేము...నడుము వాల్చనూలేము
పరువు వదులుకోలేము...పరువు కొననూలేము
సిగ్గు విడవలేము...సిరిని చేరుకోనూలేము
కష్టం నమ్ముకోలేము...కరుణ అందుకోనూలేము
కడుపు దాచుకోలేము..కనిపించేలా దోచుకోనూలేము
పన్ను మాఫీకి 'లేము'...పన్ను ఎగ్గొట్టాలేము
పరులనాశించలేము...పట్టిందే నాదననూలేము
పరుషం చచ్చిలేము...పొగరు బట్టి అంతకన్నా లేము
ప్రజల్లో మెండు మేము...లెక్కకు అక్కర్లేని జనం మేము
బరువును ఈడుస్తూ మేము..బ్రతుకుని బ్రతికిస్తున్న మేము
మధ్యరకం మనసులం మేము..మధ్యతరగతి మనుషులం మేము!!
-
వెలుగెంతలా వేధిస్తోంది...
చీకటింతలా చేరదీస్తోంది..
వర్షం ఇంతలా రోదిస్తోంది..
చలి ఇంతలా శాపిస్తోంది..
నీవు చెంతలేని ఈ ప్రకృతింత వికృతంగా
ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది...!!-
గీతలతో నను మరచిపోతావేమో..
రాతలతో నేను గుర్తుచేసుకుంటా...
మాటలతో నన్ను పొమ్మనగలవేమో..
ఆశలతో అట్టిపెట్టుకుని ఉంటా...
కోపంతో ధిక్కరిస్తావేమో..
అధికారంతో అక్కున చేర్చుకుంటా..!!-
పాటకు ప్రాణం పోసేవాడిని తెచ్చుకున్నాం అనుకున్న దేవతలకు, వ్రాసేవాడు కావాలని ఇంత తొందరగా స్ఫురించడం... వారికేమో ప్రమోదం..మనకేమో విషాదం!!
-Skv
-
కష్టాలు చెప్పుకుని ఓదార్చుకోవడంలో 'తలగడ' తరువాతే..తల్లిదండ్రులైనా..ఆత్మీయులైనా!!
-
కంటి మీద కునుకు రానియ్యని కిటుకులన్ని..
కటిక చీకటిని కూడా కాగడాలతో మంట పెట్టి..
నిద్ర తెరలను తగలబెడుతున్నాయి....!!
-
Its been a year here...
నా ప్రేమ రచనలు చదివి పళ్ళు కనపడకుండా నవ్విన వాళ్ళకి..
నా హాస్య రచనలు చదివి మొత్తం 32 పళ్ళు బయట పెట్టిన వారికి...
నా విరహ రచనలు చదివి పంటికింద బాధ అణుచుకున్న వాళ్ళకి...
నా కథలు చదివి నిజమా అని ఆశ్చర్యపోయిన వాళ్ళతో సహా అందరికీ కలిపి...
పేరు పేరునా కృతజ్ఞతలు!!-
తను నీ వేలు పట్టుకున్నా...
నీవు తన చేయి పట్టుకున్నా...
బంధం కంటే బాధ్యతనే కనపడటం..
తను నిన్ను మందలించినా..
కాల క్రమంలో తనను విసుక్కున్నా..
కోపం కంటే బాధ్యతనే వినపడటం..
తను నీ పైన ఎలా ప్రేమ చూపిస్తాడో..
తెలీకుండా నీవు అలాగే ప్రేమించడం...
నాన్నతో బంధం ఎప్పటికీ అనిర్వచనీయం!!
నాన్న
"నీవు తన బాధ్యత - తనే నీ బాధ్యత"
' ఏ ఒక్క రోజూ కాదు ప్రతీ రోజు'
-
కరుణించెను పైనున్న ఆ దైవం
వరమిచ్చెను నాకు నీ దర్శనం
అచ్చతెలుగు అందం నీ వర్ణనం
స్వచ్ఛమైన చిరునవ్వు నీ ఆభరణం
పొరపొచ్చాలు లేని నీ సుగుణం
ఆజన్మాంతం ఉంటాను నీకు రుణం
దేవకన్యలంతా చుట్టూ చేరిన తరుణం
వారందరిముందు నీ అందం ద్విగుణం
ఒట్టు వేసి చెపుతున్నా ఈ క్షణం
నిను చేరకుండా ఆపలేదు ఏ మరణం!!-