నీ హాసమింత తీయ్యగా,
తాకుతుంటె నన్నిలా,
తేలిపోన గాలిలోన తేనెటీగలా!
నీ నయనమెంతొ చిలిపిగా,
మీటుతుంటె నా ఎద,
నీ వాలు కనుల వలపులోన ఊపిరాడునా?
నీ నాట్యమెంతొ క్యూటుగా,
నవరసాలు పలుకగా,
హొయలుగన్న హంస కూడ అసూయ చెందదా?
నేనేరి తెచ్చా పదములు,
తెలియజేయ భావనలు
నా భావజాలమర్థమైతే బదులు చెప్పవే!-
భారమైపోయెను మాటలు
భావనైపోయెను భావోద్వేగాలు
మౌనమే ధ్యానమై,
భావనే తరంగమై... హృదయ మృదంగమై
నాలో పొంగెను వేవేల ఊహల ఉధృతి వరదలు...
ప్రశ్నలు లేని సమాధానాలు ఎన్నో ఎద లోతుల్లో...
శీర్షిక లేని కథలెన్నో కౌముది కౌగిట్లో...
గంగా ఛాయేమో...గల గల మాట్లాడేస్తుంది ఆ గంధర్వ ప్రియని!
రంభే వచ్చెనేమో... ఘల్లు ఘల్లుమని చెంగులేస్తుంది సిరిగల చిన్నది!
12/01/2023-
నిరంతరం తన కోసం నే పడే తపన, కురుక్షేత్ర ఘర్షణ
తన చూపు కోసం నేనాడే నాటకం, నిధుల వేటకన్న నిర్ణిద్ర కలవరం
తన పేరు కోసం నా ఆరాటం, సంద్రమెదురు చూసే నదుల సంగమం
నేనొక తాపసి, తానొక ఊర్వశి
వరమే కోరి వరించనా? వేల వాఖ్యాలు లిఖించనా?-
పక్క బెంచీలో అమ్మాయిని చూస్తున్నట్టు మాటిమాటికీ చూస్తే ఏమనుకున్నాడో ఏమో,
బుగ్గలు బాగా ఎర్రబడిపోయాయ్ సంధ్యా సమయానికి,
సిగ్గుతో చూసి చూడనట్టు,
కనిపించీ కనిపించకుండా మేఘాల్లో దాక్కుంటూ,
ఇక నా చూపుల బాణాలకు తాళలేక, అదిగో పాపం, ఆ పర్వతాల వెనుక దాక్కుంటున్నాడు బంగారు భానుడు.-
---------------------------- కాఫీ --------------------------
కాఫీ కన్న రుచికరమైన అమృతమున్న నే నమ్మనన్న
జగములోనున్న గొప్ప పానీయమన్న అది కాఫీ అన్నది ఓ సత్యమన్న!
జగములన్ని చూసాను! ఇంద్రలోకాన తిరిగాను!
మగువకై కాక మధువుకై ఆర్తిగా అడిగాను!
అప్సరసలను మించిన మగువను,
కాఫీకి సరితూగు మధువును ఏడేడా కానలేను!
వైకుంటమేగేను క్షీరసాగరం ఈదేను
హరి దంపతులను కప్పు కాఫీ అడిగాను
భువికెగిరిన గరుడ బ్రూ తో తిరిగొచ్చి
చిక్కని కాఫీ చక్కగా మాకివ్వంగ...
అరుణవర్ణ భానుడి స్పర్శ మోమును తాకె!
కళ్ళు తెరవగా అదే కాఫీతో మా అమ్మ ప్రత్యేక్షమయ్యె!-
చంద్రకాంతి వేళ
కదులుతున్న నావలా
పొంగుతున్న వరదలా
ఊరికే ఊగకే అలా...
నీ ఒంపు చూసి నేనిలా
వెంటతేన వెన్నెల
చంద్రుడైన నిన్ను చూసి ఈర్ష పడేలా?
నీ మోము చూసి చిన్నగా
కవితలెన్నొ రాయగా
కలిసిపోయి మారవా పెద్ద నవలగా?
అంతులేని ఆ నిష
నీ బారు జడకు బానిస
చిక్కుకున్న నిషకు కొంత ఊరటివ్వవా?
కరిగిపోని క్షణములా
గడిచిపోని గడియలా
ఉండిపోవ నువ్విలా కనులముందరా!-
తన మనిషని తను నన్ననుకుంటే
తను నా తను అని నేననుకోనా?
అనుకోని అతిధి కనుపాపనొదిలి
అలల సంద్రాన్ని కదిపె కంటిలోన!
మాట పెగలని గొంతు,
మూగబోయిన మనసు,
ఓదార్పు కొరకు ఎదురు చూచె!-
బలరాముడు తమ్ముడినే, కానీ కృషుడిని కాను!
లక్ష్మణుని అన్ననే, కానీ రాముడిని కాను!
ఆరుముఖాలు కలవాడిని నేను, బ్రహ్మకు తండ్రిని నేను!
విశ్వమూర్తిని నేను! విశ్వమంతా నేనే!-
ఛిద్రం...రుద్రం...వీరభద్రం
దక్ష యజ్ఞంలో ఆమె ఛిద్రం
బాధాతీత కోపంతో రౌద్రుడైన రుద్రం
జటాజూటం నుంచి ఉద్భవించె వీరభద్రం-
దాచెయ్యాలి, దర్జాగా రాయాలంటే దాచెయ్యాలి
చెప్పేస్తే చెదిరిపోయే బంధాలయితే దాచెయ్యాలి
గుండె తేలికైపోతుందంటే దాచెయ్యాలి
కలం కదలనంటే, కన్నీళ్లు రానంటే, చూపు కలవదంటే దాచెయ్యాలి
స్నేహం కుదరదంటే దాచెయ్యాలి, ప్రేమ పూయనంటే దాచెయ్యాలి
నాలో ఉన్న ప్రతీ భావాన్నీ, భావ కదలికను, భావజాలాన్ని దాచెయ్యాలి
సెలయేరై పొంగుతున్న రసాన్ని దాచెయ్యాలి
సల సల కాగే తపాన్ని జయించాలి-