మాటల కోటలు బీటలు వారాయి
బాసల బాటలు చితిగా మారాయి
కనుల కడలిలో కలలు కరిగాయి
ఊహల తలపులు నేలకు ఒరిగాయి
చివరకు,
చదువుల ఆశలు బాధను దాచాయి
నటనల నవ్వులు మోముని చేరాయి..
-
'ఆడ'దనే వంకచూపి దానమనే ముద్రవేసి తోసేస్తారు
భర్తననే హక్కుచూపి అణువణువూ చిద్రముచేసి వదిలేస్తారు
అందరి ఆనందం కోసం పాకులాడితే కనీస కర్తవ్య నిర్వహణంటారు
ఆమె అస్తిత్వం కోసం పోరాడితేనేమో సమస్త సమాజానికో కలంకమంటారు
అణుకువ ఆభరణమంటూ మగువకు సంకెళ్లేస్తారు
ఎదురుతిరిగి ప్రశిస్తే మగడనే మైకంలో రంకెలేస్తారు
స'మాన'త్వపు పాఠాలను ప్రగల్భంగా పలుకుతారు
మానమనే మసినిపూసి దౌర్బల్యంగా చూపుతారు...-
ఎవరికైనా నువ్వు అవసరంలోనే గుర్తొస్తావ్
నీ అవసరం ఉన్నంత వరకే గుర్తుంటావ్-
నగుమోమున దాగిన నటనలెన్నో
నయనములు దాచిన నిజములెన్నో
వీనులకు విందు చేసిన విషములెన్నో
చర్మమును చూపులతోనే చెరచిన చక్షువులెన్నో
ఉసురును తీసే ఊహలకందని ఉత్ప్రేరకాలెన్నో
మాటల మాటున కానని మర్మములెన్నో
మనసున మసియై కమ్మిన మాయలెన్నో
మేధను మరుగున చేర్చిన మోజులెన్నో
-
నామీద నాకు కోపం తగ్గేదాక
నే కోల్పోయినవి తిరిగి సాధించేదాకా
నా ఓటమిని విజయంగా మార్చేదాకా
-
ఈ గజిబిజి బిజీబిజీ లోకంలో
బుజ్జి బుజ్జి బుజ్జాయిల
బొజ్జలకు బుజ్జి బుజ్జి బజ్జీలు
బుజ్జగిస్తూ తినిపిస్తే బజ్జుంటారు.-
ఎద చీకట్లో ఎదురుచూపుల ఎండమావులెన్నో
మది వాకిట్లో మరులెరుగని బాటల బీటలెన్నో
నిశి కౌగిట్లో నినదించిన నిజాల నిట్టూర్పులెన్నో
విధి గుప్పిట్లో విగతమైన వేదనల వాదనలెన్నో...
-
మనసులోని భావాలను అధరములు
దాటనీయక
మతి మదిపై చేసే నిశ్శబ్ద సంఘర్షణేగా
"మౌనం"
-
కాలం కదిలిపోతోంది
కథలా జరిగిపోతోంది
"ఊ" కొట్టాలనే ఊహ మదిలో మెదిలేలోపే
ఆయువు కరిగిపోతోంది
శాశ్వత నిద్రలోకి జారిపోతోంది...
-