ఒపిగ్గా ప్రతీ ఒక్కరు ఓపికపట్టాలని,
ఓపిక ప్రతీ రోజూ ఓపిగ్గా మనని పరీక్షిస్తుంటే,
ఓపిక లేదంటూ ఓపికకే
ఓపిక నశించేంత ఫలితాలు ఒపిగ్గా మనమిస్తుంటే,
ఓపికకైనా ఓపిక చావదా మన ఓపికలేనితనాన్ని చూసి,
చచ్చిన ఓపిక మళ్ళీ మనకే పుట్టదా మన ఓపికను చూసి !-
భవిష్యత్తు మీద క్లారిటీ లేనోడు
తిరిగి తిరిగి గతానికే వచ్చి ల్యాండ్ అవుతాడు-
సూక్తులు చెప్పటంలో ప్రతీ ఒక్కడూ వివేకానందుడే,
పాటించడంలోనే
పరమానందయ్య శిష్యుడు అవుతున్నాడు.-
స్మార్ట్ ఫోన్ చెప్పే చదువుకి,
కంప్యూటర్ నేర్పే పాఠాలకు,
ఫ్యాన్ ఇచ్చే గాలికి,
సోఫా ఇచ్చే సుఖానికి,
కార్ ఇచ్చే సోమరితనానికి,
టీవీ ఇచ్చే వినోదానికి,
ఐనా రాసినోడు కూడా గుర్తుపట్టలేనంత
మారిపోయిన మనకు,
రాసినోడు రాసింది ఏం వర్తిస్తుందిలే !!-
ఎవడు రాసాడో ఏమో!
నమ్మకాన్ని చిన్న అక్షరాలతో రాసి,
మోసాన్ని రెండింతలు పెద్దగా రాసాడు.
నిజాన్ని ఇంకులేని పెన్నుతో రాసి,
అబద్ధాన్ని మార్కర్ పెన్నుతో రాసాడు!
మళ్ళీ నిజాయితీగా బతకమంటాడు,
నమ్మకమే జీవితమంటాడు,
అలా అనేటప్పుడు అవొక్కటే రాసి ఉండొచ్చుకదా?
ఎవడు రాసాడో ఏమో!
అందరికీ ఆకలి ఒక్కటే అంటాడు,
కానీ అందరి కడుపు నింపడు.
అందరికీ ఆశ ఒక్కటే అంటాడు,
కానీ అందరి ఆశలు నెరవేర్చడు.
ఇన్ని చేసి మళ్ళీ ఆనందంగా బతకమంటాడు,
ఎలా బతుకుతాడు?-
మన బలం మనకు తెలపడానికే కష్టం పలకరిస్తుందేమో,
హలాహలం గొంతు దాటనివ్వని శివుడిగా
దావానలం మదిలో రగులుతున్నా
కోలాహలం మధ్యలో ఆటలాడాలేమో,
మనం అనుకున్నట్టుగా ఉండటానికి ఇది మనం రాసుకున్న కథైతే కాదు కదా..
ఎవడు రాసాడో ఏమో!
సగం చీకట్లో సగం వెలుగులో రాసాడు,
చీకట్లో కళ్ళు మూసేసి నిద్ర అన్నాడు,
వెలుగులో వెలిగిపొమ్మన్నాడు.
అలిగిపోయే మనుషుల వరుసలో,
కరిగిపోయే మనసుల సరసన,
విసిగిపోయేలా వేదననిచ్చి,
వెలగమంటే ఏం వెలుగుతాడు?-
ఎగిరెగిరి అలసిపోయిన విమానాలకు విమానాశ్రయమున్నట్టు,
తిరిగి తిరిగి అలసిపోయిన ఆలోచనలకు
నిద్రాశ్రయముందేమో !-
మనిషివేనా నువ్వు అని
ఒక మనిషిని ఇంకో మనిషే అంటున్నాడు,
ఏం మనుషులు రా బాబు వీళ్ళు అని వీళ్ళ గురించి
ఇంకో మనిషే రాస్తున్నాడు !-
శాసించేది మనిషే ఆశించేది మనిషే
బాధించేది మనిషే బాధ పడేది మనిషే
మనకు మనమే సరిహద్దులు గీసుకొని
మళ్ళీ మనమే వాటిని
చెరపమని పోరాడితే ఎవడొచ్చి చెరుపుతాడు ?
-
నిప్పు పెడితే ఎండిపోయిన ఏ చెట్టయినా
ఇచ్చేది వెలుగే,
అది గంధపు చెక్కైతే ఏంటి,
పిచ్చి మొక్కైతే ఏంటి !
-