23 JUN 2023 AT 8:31


మాటకు రుచి ఉంటున్నది తాను పలుకుతున్నప్పుడు
మౌనం బాగుంటుందీ తాను అలుగుతున్నప్పుడు

దూర తీర దారులైన సమయ మసలు తెలియదులే
చెలి నీడలు నా అడుగుకు జతను కలుపుతున్నప్పుడు

ప్రతి రాతిరి జగడాలే తారకతో తామసితో
నా కలలను దోచేస్తూ తాము వెలుగుతున్నప్పుడు

చిరుగాలిని మోయలేని చింత ఒకటి కమ్మునులే
చిరు కోపం చూపి తనే చేయి వదులుతున్నప్పుడు

ఇరు సంధ్యలు మారుతున్న కలమసలే కదలదుగా
నా నెచ్చిలి మచ్చికలో మనసు చిక్కుకున్నప్పుడు

-


22 JUN 2023 AT 19:50

కురిసెను చిరు చినుకులు
తిరిగెను చెలి మెలికలు
తీయనైన మాట పలికి
తొలిగెను అరమరికలు

-


18 JUN 2023 AT 23:16

పతనమైన ప్రతిసారీ ఉదయించావ్ ఓ నాన్న
పడిలేచిన కెరటంలా కనిపించావ్ ఓ నాన్న

గొంతు చాటు ప్రేమ మూట..పైనే గంభీరమట
కసిరిన నీ గుండెనెంత బాధించావ్ ఓ నాన్న

నీ ఎదపై నిదురించిన చిరునవ్వుల దివ్వెలను
అలసిన నీ కథతోనే వెలిగించావ్ ఓ నాన్న

దూర తీర కలల వైపు లాగే మా మది నావను
నీ స్వేదమె ఓ నదమై నడిపించావ్ ఓ నాన్న

పగలంతా రవి చింతను ఎవరడిగారని సంధ్య
అస్తమిస్తు నే కన్నులు తెరిపించావ్ ఓ నాన్న

-


3 JUN 2023 AT 23:40

కోరిన తీరం చేరుస్తుందని
మొదలెట్టిన ఓ ప్రయాణం
ఎన్నో కలలను కూల్చేస్తూ
అది మిగిల్చింది ఓ విషాదం
"ఇంతే ఆయువు రాసుందేమో"
అనుకున్నా ఆగున రోదనం
ఎంతైనా చావుకు లేనే లేవుగ
నువ్వూ నేనను బంధనం

-


16 MAR 2023 AT 12:04

కాలం కరిగే మంచయ్యింది
మనసుకు పరుగే పనయ్యింది
అలారం కన్నా ముందే
నిద్రలేపే కలవరం
రెండు చేతులు ..నాలుగు పనులు
నలభై ఆలోచనలు
తరిగే కూరగాయలు తరిమే సమయం పొంగే పాలు
ఇంతలో మాయం ఉదయపు కాఫీ నీళ్లు
రెడీ అయ్యామని అనుకునేలోపే బస్సు వెళ్ళిపోయి కారే చెమట్లు
వచ్చి పోయే వాహనాలు వదిలే పొగలో
ఊపిరికెపుడూ స్కార్ఫ్ సంకెళ్లు
ఊరూరా పలకరించే స్పీడ్ బ్రేకర్ల వికటాట్టహాసాలు
బడికెళ్లాక.. చెప్పే చదువులు తీర్చే తగవులు
దిద్దే పేపర్లు నింపే రిపోర్టులు
ఒక కంట కనిపెడుతూనే,గబగబ తినే ముద్దలతో నిండే మధ్యాహ్నపు ఆకళ్ళు
ఇంటి గాలి మళ్ళీ పిలుస్తూ చల్లగా పలకరించే సాయంత్రాలు
...వెచ్చని టీ గొంతు జారుతుంటే గోముగా చూసే సింకులో గిన్నెలు
ఆరిన బట్టలు మడతేస్తూనే రాయించే పిల్లల హోంవర్క్స్
కాసింత నడుము వాల్చి ఫోన్ చూస్తుంటే గుర్తొచ్చే రాత్రి భోజనాలు
రేపటి గురించి ఆలోచిస్తూ వాలిన కన్నుల్లో..
ఎప్పుడొచ్చి చేరిందో తెలియని తెల్లవారు జాము మెలకువలు
ఇలా కరిగే కాలం కథలో
నేనో అలను,శిలను

-


5 JAN 2023 AT 23:56

వలపు దాచిన పిలుపు మాటున మంత్రమైనది నీవే కదా
తలపు లేనిదె క్షణము కదలదు.. యంత్ర మైనది నీవే కదా

గతము నడిచిన దారులన్నీ వేల సుమముల వనములయ్యెను
సుధలు పంచే కథగ మారిన ఛైత్ర మైనది నీవే కదా

మింటి చుక్కలు జోల పాడెను కంటి పాపకు వెన్నెలందగ
కలల తెరపై కుంచె నేనూ చిత్రమైనది నీవే కదా

ఏడు అడుగుల బంధమయేందుకు ప్రేమకున్నవి లెక్కలెన్నో
చిక్కు ముడులే విప్పుకున్నవి సూత్రమైనది నీవే కదా

నిండు మనసుతొ పొంగి పొరలే ప్రేమ నదిగా పారె సంధ్యా
కొత్త ఆశలు నాటుకున్నవి క్షేత్రమైనది నీవే కదా

-


5 JAN 2023 AT 22:42

ఒక్క మనసు ఇన్ని ఆట లెందుకనో చిత్రంగా
ఎవరో నిను బాధిస్తే అవుతావా శూన్యంగా

చివరికేది మిగిలేదీ..పంచుకున్న మంచి తప్ప
చేతనైతె నిలబడు నువు నలుగురికీ సాయంగా

కలల తోని కలత తోని కరిగించక కాలాన్నీ
తల రాతకు ఎదురీతకు నిలవాలీ ధైర్యంగా

గెలుపోటమి ఒక నాటికి గుణ పాఠమె విధి ఆటన
మంచి దారి నెంచుకునీ సాగాలీ న్యాయంగా

అక్షరాలపై ప్రేమే లక్షణమైనది సంధ్యా
మదితాకిన సమీరమై మిగలాలీ కవనంగా

-


5 JAN 2023 AT 21:39

నీ మనసే కోవెలలా అనిపించెను ఎందుకో
ప్రేమలోన కాంతులేవొ కనిపించెను ఎందుకో

హృదయంలో మునుపెరుగని ఒక రాగం కొత్తగా
నీ మాటే కోయిలలా వినిపించెను ఎందుకో

రాలుతున్న క్షణాలన్ని పోగేసెను నయనాలు
నీ కలలే రాత్రులన్ని వెలిగించెను ఎందుకో

పూవులన్ని అసూయగా అటు తిరిగెను చిత్రమై
చిరు నగవులు నీకోసం వికసించెను ఎందుకో

తలపులలో విహరిస్తూ మునివేళ్ళూ ముంగురులు
ప్రతి కవనం తొలి సంధ్యగ మురిపించెను ఎందుకో

-


28 DEC 2022 AT 22:56

నిరాశలే తరిమినపుడు కదిలించే పదం చాలు
నిశీథులే కమ్మినపుడు వెలుగిచ్చే స్వరం చాలు

కలిమి చూసి చెలిమి చేయు కపట ప్రేమ లెందుకులే
కనుల నీరు జారినపుడు స్పందించే కరం చాలు

వయసు గువ్వ ఎగిరెళ్తూ దాటిపోవు హద్దుల్నే
నీ తప్పులు ఎరిగినపుడు మన్నించే క్షణం చాలు

వారసులకు కోకొల్లలు పోగేస్తూ పూజలేల
ఆకలంటు పిలిచినపుడు కదిలొచ్చే గుణం చాలు

అరుణ వర్ణ సంధ్యలలో ఆ నింగే ఓ కవనం
మనసు మూగ బోయినపుడు పలికించే కలం చాలు

-


27 DEC 2022 AT 23:32

ప్రతి పైసకు విలువెంతో చెబుతున్నవి ఆ రోజులు
ఆశలకే హద్దు గీత గీస్తున్నవి ఆ రోజులు

వేల వేల ఫీజుల్నీ కట్టలేని వ్యథలన్ని
తుడిచేసిన కోర్కెలనే మోస్తున్నవి ఆ రోజులు

రంగులతో హంగులతో స్నేహానికి పనేముంది
ఏక రూప వస్త్రాలై పూస్తున్నవి ఆ రోజులు

పుస్తకాలు కొనలేమని వెనుదిరిగిన అడుగులకే
సరి నడకల దారులలో తోడున్నవి ఆ రోజులు

గాయానికి కాలమనే మందున్నది ఓ సంధ్యా
గతమంతా పాఠమనీ నెడుతున్నవి ఆ రోజులు

-


Fetching Cherupalli Sandhya Quotes